యూపీలో బ‌హిరంగంగా అమ్ముడ‌వుతున్న రేప్ వీడియోలు..! ఏటుపోతుంది మన దేశం?



నిన్న మొన్న‌టి వ‌ర‌కు కొంద‌రు మ‌హిళ‌లు మృగాళ్ల చేతిలో అత్యాచారానికి గురై దాంతో చెప్ప‌లేని వేద‌న‌ను అనుభ‌విస్తూ వ‌చ్చారు. అయితే ఇప్పుడా బాధ‌కు తోడు మ‌రో వేద‌న కూడా వారికి తోడ‌వుతోంది. కొంద‌రు దుండ‌గులు అత్యాచారాలు చేసే స‌మ‌యంలో తీసిన రేప్ వీడియోల‌ను ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లోకి వ‌దులుతున్నారు. ఇంకా కొంద‌రైతే ఏకంగా సీడీలు చేసి అమ్ముతున్నారు. ఇదీ… ప్ర‌స్తుతం ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో బ‌హిరంగంగా జ‌రుగుతున్న తంతు. కానీ అక్క‌డి పోలీసులు, నాయ‌కులు ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓ వైపు బాధిత మ‌హిళ‌లు మాత్రం త‌మకు ఈ రూపంలో జ‌రుగుతున్న అన్యాయాన్ని ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇప్పుడు రేప్ వీడియోల‌ను షేర్ చేయ‌డం, అమ్మ‌డం బ‌హిరంగంగానే సాగుతోంది. అందుకు కొంద‌రు పోలీసు అధికారులే వ‌త్తాసు ప‌లుకుతున్నార‌ని ఓ మీడియా సంస్థ క‌థ‌నం కూడా ప్ర‌చురించింది. అయితే దీని ప‌ట్ల ఆ రాష్ట్రంలోని పోలీసు ఉన్న‌తాధికారులు ఏమంటున్నారంటే… తాము కింది స్థాయి పోలీసుల‌కు ఆదేశాలిచ్చామ‌ని, ఒక వేళ అలాంటి వీడియోలు ఎవ‌రైనా విక్ర‌యిస్తున్నా, షేర్ చేస్తున్నా వారిని ప‌ట్టుకుంటామని చెబుతున్నారు. కానీ క్షేత్ర‌స్థాయిలో వారి ఆదేశాల ప‌నితీరు వేరేగా ఉంది. కింది స్థాయి పోలీసు సిబ్బంది ఏమంటున్నారంటే… త‌మకు ఉన్న‌తాధికారుల నుంచి ఆ విష‌య‌మై ఎలాంటి ఆదేశాలు అంద‌లేద‌ని, ఒక వేళ అందితే స‌ద‌రు వ్య‌క్తుల‌పై దాడి చేసి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నారు. అయితే దీనిపై అక్క‌డి అధికార ప‌క్షం నేత‌లు మాత్రం ఏ రీతిలోనూ స్పందించ‌డం లేదు. ఓ వైపు బాధిత మ‌హిళ‌లు త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని చెప్పుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతుంటే… మార్కెట్‌లో అలాంటి వీడియోలు మాత్రం బ‌హిరంగంగానే అమ్మ‌డవుతున్నాయి. ఇదీ… ఇప్పుడు యూపీలో నాయ‌కులు, పోలీసుల మ‌ధ్య ఉన్న స‌మ‌న్వ‌యం తీరు… వారి పని తీరు ఎలా ఉందో ఈ సంఘ‌ట‌న‌ల‌తోనే మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే బాధిత మ‌హిళ‌లు త‌మ‌పై అత్యాచారం జ‌రిగిన‌ప్పుడే పోలీస్ స్టేష‌న్ దాకా వ‌చ్చి నిందితుల‌పై కేసు పెట్టాలంటే జంకుతున్నార‌ని, ఇక ఇలాంటి విష‌యాల్లో వారు ఫిర్యాదు చేయ‌డం అంటే అది జ‌ర‌గ‌ని ప‌న‌ని కొంద‌రు సామాజిక వేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. వారి నుంచి ఫిర్యాదులు అందినా, అంద‌క‌పోయినా అలాంటి వీడియోల‌ను అమ్ముతున్న వారిపై క‌చ్చితంగా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వారు యూపీ సీఎం అఖిలేష్ యాద‌వ్‌కు కూడా ఈ విష‌యంపై విన్న‌విస్తామ‌ని అంటున్నారు. ఇంత జ‌రిగినా ఇప్ప‌టికీ పోలీసులు ఏమంటున్నారంటే… బాధిత మ‌హిళ‌లు ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తామ‌ని అంటున్నారు. ఇక పోలీసులే ఇలా ఉంటే… సామాన్యుల‌కు న్యాయం ఎలా జ‌రుగుతుంది..? అందులోనూ ఇలాంటి ప్ర‌త్యేక‌మైన విష‌యాల్లో న్యాయం జ‌రుగుతుంద‌ని అస్స‌లు ఆశించ‌లేం. ఇక ఈ విష‌యంలో ఆ రాష్ట్ర సీఎం అఖిలేష్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో వేచి చూడాలి..!

No comments

Powered by Blogger.