వెయ్యేళ్ల చరిత్ర గలిగిన ఒక ఆలయం. ఆ ఆలయాన్ని రక్షిస్తూ ఓ సాధు మొసలి. మొసలిని సాధువంటున్నారేమిటి అనుకుంటున్నారా! అదే విశేషం.



ఎటుచూసినా పచ్చదనంతో కనువిందు చేసే కేరళలోని కేసర్‌గడ్‌ జిల్లాలో అనంతపుర మహావిష్ణు ఆలయంలో ఒక సరస్సు ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆధ్యాత్మిక గాంభీర్యాన్ని సంతరించుకున్నట్టు కనిపిస్తుందీ ఆలయం. తిరువనంతపురంలోని అనంతపద్మనాభ స్వామి ఆలయానికి... ఇది మూలస్థానం. ఈ ఆలయంలో పద్మనాభస్వామి ఆదిశేషునిపై ఆసీనుడై కనిపిస్తాడు. ఆలయం చుట్టూ ఉండే సరస్సులోనే ఈ సాధు మొసలి తిరుగాడుతూ ఉంటుంది. దాని పేరు బాబియా (Babia).. బియ్యం, బెల్లం కలిపి చేసే పొంగలి మాత్రమే తింటుంది అది. ఆలయానికి పహారా కాస్తూ తిరగడమే తప్ప సరస్సులో ఉన్న చేపలకు సైతం హాని చేయదు. అవి దాని పక్కనే ఆడుకుంటూ కనిపిస్తాయి. భక్తులు చేయించిన పొంగలి ప్రసాదాన్ని ఆలయ పూజారి సరస్సు ఒడ్డుకు తీసుకురాగానే బయటకు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటుంది. మొసలి సహజంగా మాంసాహార జంతువు. కానీ బాబియా మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి శాకాహారం మాత్రమే తింటున్నది. ఇదెలా సాధ్యం? సైన్స్‌ ఈ విషయాన్ని ఒప్పుకుంటుందా? అనే ప్రశ్నకు 2006లో జింబాబ్వేలో జరిగిన ఓ సంఘటన సమాధానమిచ్చింది. ఆర్థిక సంక్షోభం వల్ల మొసళ్ల చర్మాలతో వ్యాపారం చేసే ఓ కంపెనీ తమ దగ్గర ఉన్న లక్షా అరవై నాలుగు వేల మొసళ్లకు తిండి పెట్టడం కష్టమై... వాటికి మాంసంలో కాయగూరల్ని కలిపి ఉండలుగా చేసి అందించసాగింది. కొన్ని రోజుల తర్వాత మాంసాన్ని పూర్తిగా మానేసి కేవలం శాకాహారమే పెట్టసాగారు. దాంతో నెమ్మదిగా ఆ మొసళ్లన్నీ శాకాహారులైపోయాయి. అలాగే బాబియా కూడా మొదట్నుంచీ శాకాహారానికే అలవాటు పడిందేమో!


బాబియా వయసు గురించి కూడా ఇక్కడ భిన్నమైన కథనాలు వినిపిస్తాయి. కొంతమంది బాబియాకి 150 ఏళ్ల వయసు ఉండొచ్చంటే... మరికొంతమంది మాత్రం దానికి ఎనభై ఆరేళ్లని అంటారు. ఇంకో విశేషం ఏమిటంటే ఈ ఆలయ సరస్సులో ఎప్పుడూ ఒకే ఒక మొసలి కనిపిస్తుందట. ఒకవేళ ఆలయ రక్షకురాలు బాబియా చనిపోతే సరస్సులోకి మరో కొత్త మొసలి వచ్చి, బాబియా బాధ్యతలు స్వీకరిస్తుందని ఇక్కడి వారి నమ్మకం. దీని మీద ఎన్నో కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.

No comments

Powered by Blogger.