హైదరాబాద్ బిర్యానీలో కుక్కమాంసం.. హోటల్ యజమాని అరెస్ట్
గచ్చిబౌలీలోని ఓ హోటల్‌లో మటన్ బిర్యానీలో కుక్కమాంసం కలిపారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేశాయి. దీంతో జిహెచ్‌ఎంసి ఆరోగ్యం, పారిశుద్ధ్యం విభాగం అధికారులు గచ్చిబౌలిలోని సదరు హోటల్‌పై తనిఖీలు నిర్వహించారు. సోషల్ మీడియాలో గత రెండు రోజులనుండి కుక్కలను చంపి వాటి మాంసంతో బిర్యానీ తయారు చేస్తున్న వీడియోలు హల్‌చల్ చేస్తుండటం, మంగళవారం జిహెచ్‌ఎంసికి ఫిర్యాదులు అందటంతో వారు తనిఖీలు చేపట్టారు. వెస్ట్‌జోన్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ మూర్తిరాజ్, వెటర్నటీ డాక్టర్ అబ్దుల్ వకీల్, హెల్త్ ఆఫీసర్ రవికుమార్, రాయదుర్గం పోలీసు ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ సంయుక్త ఆధ్వర్యంలోతనిఖీలు జరిగాయి. బిర్యానీతోపాటు హోటల్‌లో తయారు చేస్తున్న మాంసాహారాలను పరిశీలించి నమునాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. వీటిని పరీక్షలకు పంపుతామని రిపోర్టు ఆధారంగా ఆహార భద్రత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని మూర్తిరాజ్ తెలిపారు.
బిర్యానీలో కుక్క మాంసం కలుపుతున్నారంటూ ఫిర్యాదులు రావటంతో తమ సిబ్బంది ఆ హోటల్‌లో శ్యాంపిల్స్ సేకరించిందని, వీటిని ల్యాబ్‌కు పంపినట్లు జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ (ఆరోగ్యం, పారిశుద్ధ్యం) రవికిరణ్ తెలిపారు. ఇందులో లోపాలున్నట్లు రిపోర్టులు వస్తే వెంటనే హోటల్ యజమానిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేగాక, హోటల్ యజమాని జిహెచ్‌ఎంసి స్లాటర్ హౌజ్‌ల మాంసాన్ని వినియోగించటం లేదని కూడా నోటీసు జారీ చేశామని వెల్లడించారు.అయితే యాజమాన్యం మాత్రం తమ హోటల్‌కు మంచి పేరు ఉందని, తమ పేరు ప్రతిష్టలను దెబ్బతీయడం కోసమే ఎవరో ప్రచారం చేస్తున్నారని పేర్కొంది.
No comments